
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దాదాపు డీసీసీ నియామకం పూర్తయింది. జిల్లా కార్యవర్గం కూర్పు సైతం జరుగుతోంది. కానీ.. రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం జిల్లా సారథిని నియమించలేదు. అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో ఆశావహుల్లో అసహనం కనిపిస్తోంది. జిల్లా సారథి లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. నేడో రేపో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. నడిపించే నాయకుడు లేకపోవడంతో చుక్కాని లేని నావలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మారిందనే టాక్ వినబడుతుంది. అటు జిల్లాకు మంత్రులు లేక.. ఇటు డీసీసీ అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు