ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం!
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం!
Supreme Court


అమరావతి, 21 అక్టోబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల సమస్యలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని దాఖలైన పిటిషన్లను పరిశీలించి, నామినేషన్ల గడువును పొడిగించే అంశంపై గురువారం (అక్టోబర్ 22) నాటికి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (APSEC) ను ఆదేశించింది.

న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన వెకేషన్ బెంచ్ బుధవారం ఈ విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర అభ్యర్థులు అందజేసిన ఫిర్యాదులు, వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

ఈ సందర్భంగా కోర్టు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది:

అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. నామినేషన్ల గడువు పొడిగించాలని ఎన్నికల కమిషన్ భావిస్తే, ఆ నిర్ణయం వెలువడిన సమయం నుంచి అభ్యర్థులకు నామినేషన్లు సమర్పించడానికి కనీసం 48 గంటల సమయం కేటాయించాలని స్పష్టం చేసింది. నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో అర్హులైన అభ్యర్థులందరికీ స్వేచ్ఛగా, పారదర్శకంగా పాల్గొనే అవకాశం కల్పించాలని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశంపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande