'అర్ణబ్' తుపాను ముప్పుపై అప్రమత్తమైన విద్యుత్ శాఖ: 41 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న 'అర్ణబ్' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.
karnataka-electricity-bill-hike-40-50-paise-per-unit-october-november


అమరావతి , 26 అక్టోబర్ (హి.స.)

బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న 'అర్ణబ్' తుపాను ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APEPDCL) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. తీరప్రాంత జిల్లాల్లో గాలివానల వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగే, వైర్లు తెగిపడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది.

సంస్థ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 41 అత్యవసర కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ నిమిషంలోనైనా ఫిర్యాదులు స్వీకరించేలా ఇద్దరు చొప్పున అధికారులను నిరంతరం విధుల్లో ఉంచినట్లు విద్యుత్ శాఖ యాజమాన్యం స్పష్టం చేసింది.

క్షేత్రస్థాయిలో 4,056 మంది సిబ్బంది సిద్ధం

ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించేందుకు గాను 4,056 మంది సాంకేతిక, క్షేత్రస్థాయి సిబ్బందిని సిబ్బంది పరికరాలతో సిద్ధం చేశారు. అదనపు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు మరియు కండక్టర్లను జిల్లాల వారీగా స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచారు.

విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. రోడ్లపై తెగిపడిన వైర్లను తాకవద్దని, విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టేయకూడదని సూచించింది. అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande