శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు: చెన్నైకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు: చెన్నైకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
arrest


హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) బాంబు బెదిరింపు కాల్ చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యుడైన తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన శరత్ సుబ్రహ్మణ్యం (45) అనే వ్యక్తిని శంషాబాద్ పోలీసులు వేగంగా స్పందించి అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే, విమానాశ్రయ నిఘా విభాగం మరియు కాల్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విమానాశ్రయం ప్రాంగణంలో, అలాగే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఒక విమానంలో బాంబు అమర్చినట్లు, కొద్దిసేపట్లోనే అది పేలిపోతుందని ఆ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు, సీఐఎస్‌ఎఫ్ (CISF) భద్రతా బలగాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తక్షణమే తనిఖీలు చేపట్టాయి.

విమానాశ్రయ ప్రాంగణాన్ని మరియు విమానాలను అంగుళాంగుళం తనిఖీ చేసిన అనంతరం, అదొక ఫేక్ (అసత్యపు) బెదిరింపు కాల్ అని అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు చెన్నైకి చెందిన శరత్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

ప్రత్యేక పోలీస్ బృందం అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించింది. నిందితుడు ఎందుకు ఈ బెదిరింపు కాల్ చేశాడు, మానసిక ఒత్తిడి వల్ల చేశాడా లేక వేరే ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా అనే కోణంలో క్రిమినల్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇటువంటి అసత్యపు కాల్స్ చేసి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande