
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రూపాంతరం చెందిన 'అర్ణబ్' తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా స్పష్టంగా పడనుంది. ఈ తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన ఈదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధికారులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తుపాను ముప్పు దృష్ట్యా వ్యవసాయ రంగానికి తీవ్ర విఘాతం కలగకుండా ఉండేందుకు అధికారులు రైతులను అప్రమత్తం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న ధాన్యం, ఇతర పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిపోకుండా తార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
మరోవైపు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా మున్సిపల్ అధికారులను, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్ధం చేశారు. అత్యవసర సహాయం కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలు వర్షాల సమయంలో అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi