
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
నగరంలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'ఈగల్ ఫోర్స్' (Eagle Force) అధికారులు సోమవారం ఫతేనగర్ ప్రాంతంలో వినూత్న రీతిలో సాగుతున్న గంజాయి దందాను బట్టబయలు చేశారు. ఫతేనగర్‌లోని ఎల్‌బీఎస్ నగర్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 75 ఏళ్ల జతేన్ బీ అనే వృద్ధురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వయసు పైబడిన మహిళ కావడంతో ఎవరికీ అనుమానం రాదనే భావనతో ఆమె గత కొంతకాలంగా ఇల్లు కేంద్రంగా చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని విక్రయిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. స్థానిక యువకులు, దినసరి కూలీలకు ఆమె రహస్యంగా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తోందని గుర్తించిన పోలీసులు మెరుపు దాడి చేశారు.
ఈ దాడుల్లో ఆమె వద్ద నుంచి 179 గ్రాముల బరువున్న గంజాయి ప్యాకెట్లతో పాటు గంజాయి విక్రయించగా వచ్చిన రూ. 43,340 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
విచారణలో ఆమెకు ఈ గంజాయిని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే విషయాలపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అక్రమ దందాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, నగరంలో గంజాయి రహిత వాతావరణాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని భద్రతాధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు