తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల తాకిడి: సర్వదర్శనానికి 15 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల రద్దీ తీవ్రంగా పెరుగుతోంది.
Temple


అమరావతి , 26 అక్టోబర్ (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల రద్దీ తీవ్రంగా పెరుగుతోంది. వారాంతపు సెలవులు, ఆధ్యాత్మిక పవిత్ర దినాలు కావడంతో దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఏడుకొండలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలి వరకు విస్తరించాయి.

టోకెన్లు లేని సర్వదర్శనం (నడకదారిన వచ్చే భక్తులు మరియు సాధారణ క్యూలైన్ భక్తులు) ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రక్రియ వేగవంతంగా సాగేలా చర్యలు చేపట్టారు.

భక్తులకు సౌకర్యాలు – హుండీ ఆదాయం రూ. 4.25 కోట్లు

క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు క్యూ కాంప్లెక్స్ పరిసరాల్లో నిరంతరం సేవలందిస్తున్నారు.

ఆదివారం ఒక్కరోజే మొత్తం 85,369 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, అందులో 31,452 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ద్వారా ఒక్కరోజే రూ. 4.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. భక్తులు ఓపికతో క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande