
హైదరాబాద్, 26 అక్టోబర్ (హి.స.)
ఐటీ కారిడార్ కేంద్రంగా పనిచేస్తున్న డ్రగ్స్ విక్రయ ముఠాలపై సైబరాబాద్ పోలీసులు నిరంతర నిఘా ఉంచారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఒక ముఠాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా కొండాపూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఆకుల సాయిరామ్ అనే వ్యక్తిని పోలీసులు రంగ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 4.45 గ్రాముల అత్యంత ప్రమాదకరమైన నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలతో పాటు, డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న ఒక ద్విచక్ర వాహనం, డ్రగ్స్‌ను చిన్న చిన్న మోతాదుల్లో తూకం వేసేందుకు ఉపయోగిస్తున్న డిజిటల్ వెయింగ్ మెషిన్ మరియు ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠాలో మరో ఇద్దరు సభ్యులు భాగస్వాములుగా ఉన్నారని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. బెంగళూరు మరియు గోవా ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోని యువత, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని విక్రయించేందుకు నిందితులు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ విక్రేతలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, సరఫరా గొలుసును పూర్తిగా మట్టుబెడతామని పోలీసులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi