
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని పేర్కొన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు విమర్శించారు. అప్పటి పరిస్థితుల కారణంగా రాష్ట్ర పునర్నిర్మాణం పెద్ద బాధ్యతగా మారిందన్నారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఎదురైన పరిస్థితులను, తన అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలను ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినట్లు వివరించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘనవిజయం ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం ద్వారా గత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్పష్టమైందన్నారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని చెప్పారు.
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉండే నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఎంపికలో విద్యావంతులు, యువతతో పాటు నీతి, నిజాయతీకి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. స్థానిక పాలనా వ్యవస్థను పటిష్ఠం చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్