
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో మార్పులు, ట్యాంపరింగ్ జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
ఫారం-6లో జరిగినట్లు ఆరోపిస్తున్న మార్పులకు సంబంధించి ఈసీఐ ఇటీవల విడుదల చేసిన ప్రకటనపై న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్లుగా ఎన్నికల సంఘం పేర్కొనడాన్ని వారు ప్రశ్నించారు.
అయితే, తాము గతంలో అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసినట్లు సమాచారం.
ఫారం-6లో మార్పులు, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలకు సంబంధించి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలపై తదుపరి విచారణలో తమ వాదనలు వినిపించేందుకు, కౌంటర్ అఫిడవిట్లు సమర్పించేందుకు న్యాయవాదులు ధర్మాసనం నుంచి మరింత సమయం కోరారు.
దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియలో ఓటరు నమోదు వివరాల ప్రామాణికత, ఎన్నికల సంఘం చర్యలపై ఈ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్