తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు... పిసిసి చీఫ్
సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రజల మద్దతు లేదని వ్యాఖ్యానించారు
Pcc


హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తాము వంద సీట్లు సాధిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. సీఎం రేవంత్రెడ్డిపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రజల మద్దతు లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, కోలుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 ఎంపీటీసీ సీట్లు, రెండు జడ్పీటీసీ సీట్లు కూడా దక్కడం కష్టమేనని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉందని, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 శాతం సీట్లు తమ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో హరీశ్రావు పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు గ్రౌండ్లో యాక్టివ్గా పనిచేస్తున్నారని, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కార్యకలాపాలను తాను స్వయంగా గమనిస్తున్నానని చెప్పారు. కేటీఆర్ మాత్రం అసలు విషయాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande