తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
తిరుమల


తిరుమల, 06 అక్టోబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. తమిళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున రావడంతో సప్తగిరులు జనసంద్రమైంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా భక్తులతో కిక్కిరిశాయి. ఆక్టోపస్ భవనం గుండా భక్తులను టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు.

శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టైమ్స్లాట్ (SSD) టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా తాగునీరు, వేడి పాలు, అల్పాహారం మరియు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను దేవస్థానం సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 83,252 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.56 కోట్లు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు 28,683 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande