
దోర్నాల, 06 అక్టోబర్ (హి.స.)ఇటీవలి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
చిరుతపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మార్కాపురం జిల్లాలోని దోర్నాల మండలం బొమ్మలాపురంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. లింగయ్య డొంక వద్ద పొలాల్లో ఉన్న రైతులకు చిరుత పులి కనిపించింది.
దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన రైతులు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి గ్రామం చివరి వీధి వైపు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఊహించని విధంగా చిరుత పులి గ్రామానికి సమీపంలో కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
చిరుత పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. పలు గ్రామాల్లో స్థానికులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి గానీ, అడవిలోకి గానీ వెళ్లకూడదని, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. చిరుత పులి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు ఫారెస్ట్ రేంజర్ వి ఎన్ రెడ్డి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV