ఉమ్మడి కడప జిల్లాలో ఏడు మున్సిపాలిటీల ఛైర్మన్ పీఠాలు ఏకగ్రీవం
ఉమ్మడి కడప జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఉండగా, రాయచోటి, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల ఛైర్మన్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
Vote


ఉమ్మడి కడప , 01 నవంబర్ (హి.స.)

ఉమ్మడి కడప జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు ఉండగా, రాయచోటి, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల ఛైర్మన్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాయచోటి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలతో పాటు కమలాపురం నగర పంచాయతీలోని అన్ని వార్డుల్లోనూ ఏకగ్రీవ ఫలితాలు వెలువడ్డాయి.

కడప నగరపాలక సంస్థలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, ఇప్పటికే 52 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 14 డివిజన్లతో పాటు మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మేయర్ స్థానం కోసం 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 14 డివిజన్లలో 48 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 560 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 155 అత్యంత సమస్యాత్మకమైనవి, 180 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మిగిలిన 225 కేంద్రాలను సాధారణ పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో మొత్తం 4,39,035 మంది పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,12,807 మంది పురుషులు, 2,25,681 మంది మహిళలు, 547 మంది ఇతరులు ఉన్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 3,07,093 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande