
కరీంనగర్, 01 నవంబర్ (హి.స.)
శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా కరీంనగర్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ సహా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.
ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో వాహనాల పత్రాలు, నంబర్ ప్లేట్లను తనిఖీ చేయడంతో పాటు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, రౌడీషీటర్లు, పాత నేరస్థులు, గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..