క్వారీ గుంతలో మునిగి ఇద్దరు కళాశాల విద్యార్థుల మృతి
సికింద్రాబాద్ పరిధిలోని జవహర్నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం క్వారీ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు కళాశాల విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు.
Water


హైదరాబాద్ , 01 నవంబర్ (హి.స.)

సికింద్రాబాద్ పరిధిలోని జవహర్నగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం క్వారీ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు కళాశాల విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది యువకులు సరదాగా గడిపేందుకు జవహర్నగర్లోని క్వారీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ భోజనం చేసిన అనంతరం ప్లేట్లు శుభ్రం చేసేందుకు నీటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలోని నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయి బయటకు రాలేకపోయారు.

సమాచారం అందుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి నీటిలో మునిగిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులను సయన్ (18), రోహిత్ (18)గా గుర్తించారు. ఇద్దరూ కళాశాల విద్యార్థులుగా తెలిసింది.

చిన్న వయసులోనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. క్వారీ గుంతల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande