
చిత్తూరు, 01 నవంబర్ (హి.స.)
చిత్తూరు జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఓటర్ల సందడి నెలకొంది. చిత్తూరు కార్పొరేషన్తో పాటు పలమనేరు, కుప్పం, నగరి పురపాలక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొత్తం 128 డివిజన్లు, వార్డుల్లో ఓటింగ్ జరుగుతోంది. ఆయా కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు నగరి పురపాలక ఎన్నికల్లో ఇప్పటికే చైర్పర్సన్ పదవితో పాటు నాలుగు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసే వరకు ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్