
కాకినాడ , 01 నవంబర్ (హి.స.)
కాకినాడ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం ఆరు పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో పిఠాపురం, తుని, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలతో పాటు ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి.
ఈ ఆరు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 191 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరు ఛైర్మన్ స్థానాల కోసం 31 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 191 వార్డు కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 469 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ముందే జనసేన పార్టీ మూడు, తెలుగుదేశం పార్టీ ఒక కౌన్సిలర్ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. దీంతో మిగిలిన 187 వార్డు కౌన్సిలర్ స్థానాలకు ప్రస్తుతం ఓటింగ్ జరుగుతోంది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,18,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్