
అమరావతి , 10 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఆయా రంగాల్లో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.
అలాగే ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపైనా మంత్రివర్గం చర్చించనుంది. సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు, పెట్టుబడుల సమీకరణపై సమీక్షించే అవకాశం ఉంది.
వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, పెట్టుబడిదారులకు అవసరమైన సహకారం అందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్