మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక.. 14, 15 తేదీల్లో సముద్రంలోకి వెళ్లొద్దు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather update


అమరావతి , 10 నవంబర్ (హి.స.)బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఇది ఏర్పడిన 24 గంటల్లోనే మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14, 15 తేదీల్లో సముద్రంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఈ నెల 14, 15 తేదీల్లో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరింది. సముద్రంలో అలల ఉద్ధృతి, బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande