
అమరావతి , 10 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై మంత్రివర్గ సమావేశంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని కేబినెట్ సమావేశ మందిరం చప్పట్లతో మార్మోగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజయోత్సాహంతో పరస్పరం అభినందించుకున్నారు. ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. అనంతరం ఇద్దరూ కలిసి మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారు. సమావేశ మందిరంలోకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రవేశించగానే అక్కడ ఉన్న మంత్రులంతా వారిని అభినందనలతో ముంచెత్తారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాన్ని మంత్రులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో కొద్దిసేపు సందడి నెలకొంది. ఎన్నికల ఫలితాలు కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నేతలు భావిస్తున్నారు. ప్రజలు తమ పాలనకు మద్దతుగా తీర్పు ఇచ్చారని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కనిపించిన ఉత్సాహం, మంత్రుల అభినందనలతో కేబినెట్ సమావేశం విజయోత్సవ వాతావరణంలో ప్రారంభమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్