ఈనెల 19, 20 తేదీల్లో జడ్పీ ఛైర్పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది.
Vote


అమరావతి , 10 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్లు, వైస్ఛైర్మన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమైన సమావేశాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ మేరకు పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 659 మండల పరిషత్లు, 28 జిల్లా పరిషత్లకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక జరగనుంది. ఈ ఎన్నికల్లో చేతులు ఎత్తే విధానాన్ని అనుసరించనున్నారు. ఎన్నికల ప్రక్రియతోపాటు ప్రతి మండల పరిషత్లో ఒకరు, ప్రతి జిల్లా పరిషత్లో ఇద్దరు చొప్పున కోఆప్షన్ సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు.

ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే వారు సమావేశాలకు హాజరుకావచ్చని, కానీ ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసే అధికారం ఉండదని స్పష్టం చేసింది. ఎన్నికలు సజావుగా, నిబంధనల ప్రకారం జరిగేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరిషత్ పాలకవర్గాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande