
హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)
కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణ, హరహర మహాదేవ నినాదాలతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి.
కార్తీక మాసంలో పవిత్ర స్నానాలకు విశేష ప్రాధాన్యం ఉండటంతో గోదావరి నది తీరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భద్రాచలంలోని గోదావరి నది వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపిస్తోంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కార్తీక దీపాల వెలుగులతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు నదిలో దీపాలు వదులుతూ తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాల్లోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు, అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాస పూజలతో రెండు రాష్ట్రాల్లోనూ భక్తిభావం వెల్లివిరుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్