
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)
మాధాపూర్‌లో ఉన్న తమ్మిడికుంట చెరువును ఆక్రమణల నుంచి బయటపడేసి, దానికి పాత అందాన్ని తిరిగి తెచ్చేందుకు హైడ్రా చేసిన పనులు పూర్తయ్యాయి. నగరం మధ్యలో పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేసిన ఈ చెరువు ఇప్పుడు అందరినీ ఆకట్టుకునే ప్రత్యేక ప్రదేశంగా మారబోతోంది. ఈనెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నారు.
మాధాపూర్‌లో శిల్పారామం ఎదురుగా ఉన్న ఈ చెరువు చుట్టుపక్కల గతంలో భరించలేని దుర్వాసన వచ్చేది. మురుగునీరు నేరుగా చెరువులోకి వచ్చి చేరడంతో నీరు పూర్తిగా పాడైపోయింది. చుట్టూ ముళ్ల పొదలు, ప్లాస్టిక్ చెత్త, కట్టడాల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఆసుపత్రుల వ్యర్థాలను కూడా ఇక్కడే పడేయడంతో చెరువు నీరు మాత్రమే కాదు, చుట్టుపక్కల భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది. దోమలు, క్రిమి కీటకాలతో స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు.
ఈ దుస్థితిని మార్చాలని హైడ్రా చెరువును బాగు చేసే పనులు మొదలుపెట్టింది. చెరువులో పేరుకుపోయిన పెద్ద మొత్తంలో మట్టి, పూడిక, ప్లాస్టిక్, కట్టడాల శిథిలాలు, బండరాళ్లను తీసేసింది. దాదాపు 15 అడుగుల లోతు వరకు పూడిక తీసి, వందల కొద్దీ లారీల చెత్తను బయటకు తరలించింది. దాంతో చెరువు అడుగు నుంచి నీరు భూమిలోకి ఇంకడానికి దారి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు చేరిన నీరు పెద్ద మొత్తంలో భూమిలోకి ఇంకిపోవడం కూడా ఈ పునరుద్ధరణ పనుల ఫలితమేనని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..