
జగిత్యాల, 10 నవంబర్ (హి.స.)
2027లో జరగబోయే గోదావరి పుష్కరాల కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులకు సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి వివిధ శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు.
కన్సల్టెన్సీ ప్రతిపాదనల ప్రకారం ధర్మపురిలో 1,331.84 హెక్టార్ల పరిధిలో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాంతాన్ని 9 జోన్లు, 20 సెక్టార్లుగా విభజించి వేర్వేరు శాఖలకు బాధ్యతలు అప్పగించేలా ప్రణాళిక వేశారు. దాదాపు 161 హెక్టార్లలో పార్కింగ్, 33 హెక్టార్లలో టెంట్ సిటీ, 10 హెక్టార్లలో హోల్డింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సుమారు 800 మీటర్ల మేర గోదావరి ఘాట్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, బస్టాండ్ ఆధునీకరణ, ఆలయ పరిసరాల్లో వసతులు, పారిశుద్ధ్య సదుపాయాలు, జీవవైవిధ్య పార్కు అభివృద్ధి వంటి పనులను కూడా ప్రతిపాదించారు.
పుష్కరాలకు ముందుగానే అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈవై కన్సల్టెన్సీ తయారు చేసిన ప్రాథమిక ప్రణాళికను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. పనులకు సంబంధించిన అంచనాలను నిర్ణీత నమూనాలో మూడు రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. ధర్మపురి గోదావరి తీరంలో స్నాన ఘాట్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి సదుపాయాలు కల్పించేందుకు అనువైన చోట్లను గుర్తించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..