
నల్గొండ, 10 నవంబర్ (హి.స.)
కరువు పరిస్థితులు ఉన్నా సరే అభివృద్ధి పనులు, ఉపాధి కార్యక్రమాలు ఆగకుండా కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
చిట్యాల పట్టణంలో మంగళవారం ఎఫ్‌పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటుందని, అందుకే రైతులు బయట మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో దేశం మొత్తం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వాటి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మూసీ, కృష్ణా నీళ్లతో నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ధర్మారెడ్డి కాల్వ పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..