జాతీయ కుటుంబ లబ్ధి పథకం పునరుద్ధరణ.. కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల సాయం
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ లబ్ధి పథకాన్ని ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది.
జాతీయ కుటుంబ లబ్ధి పథకం పునరుద్ధరణ.. కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేల సాయం


హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ లబ్ధి పథకాన్ని ప్రభుత్వం తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది.

ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన పేద కుటుంబాలకు కొంత ఆర్థిక తోడ్పాటు లభించనుంది. కుటుంబ పెద్ద అకాల మరణంతో జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఈ సాయం ఉపయోగపడనుంది. అయితే పథకం కింద ఆర్థిక సహాయం పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి మరణించే సమయానికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అర్హత ఉన్న కుటుంబాలు అవసరమైన పత్రాలతో సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం పునరుద్ధరణతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఊరట లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande