
అమరావతి , 10 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోమవారం రాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల వ్యక్తిగత కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు.
విడిపోతున్నప్పటికీ ఒకరిపై మరొకరికి గౌరవం, స్నేహభావం కొనసాగుతాయని తమ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని తెలిపారు. అలాగే పిల్లల భవిష్యత్తు విషయంలో ఇద్దరూ సమాన బాధ్యతతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలకు అవసరమైన ప్రేమ, ఆదరణ అందించేందుకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు.
తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయంపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని పరోక్షంగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకుని, తమ గోప్యతకు భంగం కలిగించకుండా గౌరవించాలని అభిమానులు, ప్రజలు, మీడియా ప్రతినిధులను కోరారు. ఈ ప్రకటనతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్