
మహబూబ్నగర్, 10 నవంబర్ (హి.స.)
జడ్చర్ల దగ్గర జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొస్తున్న కారు అదుపుతప్పి ముందున్న లారీ వెనుక భాగాన్ని గట్టిగా గుద్దేసింది. ఈ ఢీకి ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే కన్నుమూయగా, పక్కన కూర్చున్న మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జడ్చర్ల పరిధిలోకి వచ్చింది. త్రీ స్టార్ హోటల్ దగ్గరకు రాగానే ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా తాకింది. కారు అతివేగంతో ఉండటం వల్లే ప్రమాదం ఇంత పెద్దదైందని పోలీసులు భావిస్తున్నారు.
మృతుడిని చిత్తూరుకు చెందిన కిల్జీ ప్రసాద్ (39) గా గుర్తించారు. ఆయన హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి కోసం ఊరికి వెళ్లి, తిరిగి హైదరాబాద్కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు బలమైన దెబ్బ తగలడంతో అతడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెబుతున్నారు. అతడు ఎవరనేది ఇంకా తేలలేదు. పోలీసులు కేసు పెట్టి, గాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..