
హైదరాబాద్ , 10 నవంబర్ (హి.స.)రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక వేడుకలకు వేదికగా మారింది. త్రిదండి చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యతీంద్ర సప్తతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా నేడు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జానపద కళాబృందాల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలతో కూడిన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. అలాగే చిన్నజీయర్ స్వామి తిరునక్షత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు.
సాయంత్రం 5 గంటలకు మంగళ తరంగిణి-2026 కార్యక్రమం జరగనుంది. మరోవైపు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ విరాట్ పారాయణం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షిస్తూ నారసింహస్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్