
అమరావతి , 10 నవంబర్ (హి.స.)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉదయం తాడేపల్లికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. నేతలతో ఒకేసారి కాకుండా విడివిడిగా భేటీ అయి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వాటిపై పార్టీ తరఫున స్పందించాల్సిన తీరుపై కూడా నేతలతో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయడం వంటి అంశాలపైనా చర్చ జరిగే అవకాశముంది. వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా నేతల నుంచి వివరాలు సేకరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్