హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఎదురుదెబ్బ
తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఎదురుదెబ్బ తగిలింది.
Hydra


హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)

తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసు విషయంలో నవంబర్ 17న ఆయనను స్వయంగా కోర్టు ముందు హాజరుపరిచేలా చూడాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ధర్మాసనం ఆదేశించింది. అధికారిక పనుల్లో బిజీగా ఉన్నామనే కారణం చెప్పి కోర్టు ఆదేశాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు.

శంషాబాద్ పరిధిలో 9.05 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంలోనే ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఆ భూమికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్ లో ఉండగానే అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇంతకుముందే సమన్లు జారీ అయినా విచారణకు హాజరు కాకపోవడాన్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని రంగనాథ్ పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

అదే రోజు శంషాబాద్ తహసీల్దార్ కూడా స్వయంగా కోర్టుకు రావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే కోర్టు ఆదేశాలను ధిక్కరించడం, సమన్లను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande