
అమరావతి , 13 నవంబర్ (హి.స.)విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు రానా దగ్గుబాటి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై రానా మంత్రి లోకేశ్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
దీనికి స్పందించిన లోకేశ్.. విశాఖపట్నాన్ని సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న తరహాలోనే విశాఖలోనూ సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. సినిమా షూటింగ్‌లు, నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దిశగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నిర్మాతలు, ఇతర రంగాల ప్రతినిధులు ముందుకు వచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. దీనిపై రానా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సంభాషణ సదస్సులో ఆసక్తిని రేకెత్తించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్