
అమరావతి , 13 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దీనికి 'అక్వాన్' (AQUAN) అనే పేరు పెట్టనున్నారు.
ఈ నెల 15వ తేదీ నుంచి సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. తుఫాన్‌గా మారిన అనంతరం దీని గమనం ఉత్తర కోస్తాంధ్ర వైపు ఉండే అవకాశాలున్నాయని వివరించారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రంలో అలజడి, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే తుఫాన్ తీవ్రత, గమనం, తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత రానున్న రోజుల్లో వాతావరణ శాఖ అంచనాల ద్వారా వెల్లడికానుంది. ప్రజలు అధికారిక హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్