
అమరావతి , 13 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతోందా? లేక ఆటవిక రాజ్యం నడుస్తోందా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎన్నికల నిర్వహణ సమయంలో జరిగిన ఆందోళనలు, వివాదాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయని తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలే ప్రధాన పునాది అని స్పష్టం చేశారు.
రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్నికల పారదర్శకతను, విశ్వసనీయతను బలిచేయకూడదని హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా కఠినమైన, సమర్థంగా అమలు చేయగల మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వ్యవహారంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్