
అమరావతి , 13 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం జిల్లాల పర్యటన చేపట్టింది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లాలో పర్యటించిన అధికారులు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుపాను కారణంగా వ్యవసాయం, మత్స్యకార రంగాలకు జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు.
తొలుత బాపట్లలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సందర్శించింది. తుపాను సమయంలో చోటుచేసుకున్న పరిస్థితులు, దెబ్బతిన్న ప్రాంతాలు, సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను పరిశీలించింది. అనంతరం జిల్లెళ్లమూడి ప్రాంతానికి చేరుకుని తుపాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించింది. రైతులతో మాట్లాడి పంట నష్టం, వ్యవసాయ రంగంపై పడిన ప్రభావం గురించి వివరాలు తెలుసుకుంది.
అనంతరం చీరాల ప్రాంతంలో పర్యటించి దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లను పరిశీలించింది. తుపాను కారణంగా మత్స్యకారులు ఎదుర్కొన్న ఇబ్బందులు, జరిగిన ఆస్తి నష్టంపై ఆరా తీసింది. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను కేంద్రానికి నివేదించనుంది.
ఇదిలా ఉండగా, కేంద్ర బృందం రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనుంది. అక్కడ కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్