
జనగామ, 12 నవంబర్ (హి.స.)
జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి సెపాక్ తక్రా టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్-2026 పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి.
మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన మార్చ్ పాస్ట్, క్రీడా ప్రమాణ స్వీకారం అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చిన ప్రతి విద్యార్థి ఇప్పటికే విజేతేనని, భయం, బద్ధకాన్ని వీడి బరిలోకి దిగడమే గొప్ప విషయమని అన్నారు. ఫలితంతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. సెపాక్ తక్రా ఎంతో నైపుణ్యం, చురుకుదనం, శారీరక సామర్థ్యం అవసరమయ్యే వినూత్న క్రీడ అని, దక్షిణాసియా దేశాల్లో ప్రాచుర్యం పొంది ఆసియా క్రీడల్లోనూ గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ఆట నియమాలు పాటిస్తూ, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆడాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని, తరగతి గదిలో పుస్తకాల ద్వారా విద్య అభ్యసిస్తే మైదానంలో జీవితానికి అవసరమైన విలువైన పాఠాలు నేర్చుకుంటారని అన్నారు. ఓటమి తర్వాత మళ్లీ నిలబడే ధైర్యం, గెలుపోటములను సమానంగా స్వీకరించడం, ప్రత్యర్థులను గౌరవించడం, స్నేహభావం, సమష్టి కృషి వంటి లక్షణాలు క్రీడల ద్వారానే అలవడతాయని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..