బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ ఉర్సులో ఉన్న బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గురుకులంలో ఆమె పలు విభాగాలను తిరిగి చూశారు.
Collector


వరంగల్, 12 నవంబర్ (హి.స.)

వరంగల్ ఉర్సులో ఉన్న బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గురుకులంలో ఆమె పలు విభాగాలను తిరిగి చూశారు.

ముఖ్యంగా అమ్మాయిలకు పెడుతున్న భోజనం ఎలా ఉందో, అందులో పోషక విలువలు సరిగా ఉన్నాయో లేదో స్వయంగా పరిశీలించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, వసతి గదుల పరిస్థితిపై సిబ్బందితో ఆరా తీశారు. పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే మంచి ఆహారమే కీలకమని, వంట, సరఫరా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు స్పష్టం చేశారు.

తర్వాత విద్యార్థినులతో సరదాగా మాట్లాడిన కలెక్టర్, చలికాలం వచ్చేస్తోందని, ఈ సమయంలో జలుబు, జ్వరం వంటివి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. వెచ్చగా ఉండే బట్టలు వేసుకోవాలని, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఒంట్లో ఏమాత్రం నలతగా అనిపించినా వెంటనే చెప్పాలని సూచించారు. హాస్టల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే భయపడకుండా అక్కడ పెట్టిన ఫిర్యాదు పెట్టెలో రాసి వేయాలని, వాటిని తాను స్వయంగా చూసి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande