జువ్వలదిన్నెలో సముద్ర స్వయంప్రతిపత్తి కేంద్రం ఏర్పాటుకు లోకేశ్ ప్రతిపాదన
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్.. సాగర్ డిఫెన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ నికుంజ్ పరాశర్తో సమావేశమయ్యారు.
Lokesh


విశాఖపట్నం , 13 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్.. సాగర్ డిఫెన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ నికుంజ్ పరాశర్తో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సముద్ర స్వయంప్రతిపత్తి కేంద్రం, రోబోటిక్స్ నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మానవరహిత నౌకల తయారీ, ఎగుమతులకు జువ్వలదిన్నెను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనను వివరించారు. ఐఐటీ తిరుపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

తూర్పు నావికాదళం, కోస్ట్గార్డ్ అవసరాలకు అనుగుణంగా సముద్ర పరీక్షలు నిర్వహించే అంశంపైనా చర్చించారు. కృష్ణా-గోదావరి బేసిన్లో సముద్ర తనిఖీలు, నౌకాశ్రయాల భద్రత, హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు మానవరహిత నౌకలను వినియోగించాలని ప్రతిపాదించారు. తుపాన్లు, వరదల సమయంలో రోబోటిక్స్, డ్రోన్లతో సహాయక చర్యలు చేపట్టే అవకాశాలను వివరించారు.

ఎండ్యూర్ ఎయిర్, సాగర్ డిఫెన్స్ సంస్థలు ఏపీలో డ్రోన్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆహ్వానించారు. బ్యాటరీలు, సెన్సార్లు, కాంపోజిట్ల తయారీ సంస్థలు నెల్లూరులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని నికుంజ్ పరాశర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande