ఏపీలో మరో రూ.700 కోట్ల పెట్టుబడికి డిక్సన్ ఆసక్తి.. 2,300 ఉద్యోగాల కల్పనకు అవకాశం
ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో అదనంగా రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది.
Lokesh


అమరావతి , 13 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో అదనంగా రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. సంస్థ అధ్యక్షుడు పంకజ్ శర్మ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు చర్చించారు.

ఈ భేటీలో తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ-2)లో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని డిక్సన్ ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రతిపాదిత పెట్టుబడులతో సుమారు 2,300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం మరింత విస్తరించనుంది.

సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మరో కీలక సూచన చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేయనున్న తయారీ కేంద్రంలో ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, సర్వర్ల ఉత్పత్తికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని డిక్సన్ యాజమాన్యాన్ని కోరారు. దీనిపై స్పందించిన సంస్థ అధ్యక్షుడు పంకజ్ శర్మ మంత్రి ప్రతిపాదనను పరిశీలిస్తామని తెలిపారు.

ఈ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే తిరుపతి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు అందనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande