
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
అవసరమైనప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడానికి మీకు హక్కు ఎక్కడిది రాహుల్ గాంధీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో స్పందించకుండా ఇప్పుడు భారీగా ప్రజాధనం ఖర్చు చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తలెత్తినప్పుడు స్పందించని రాహుల్ ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమానికి ఎలా వస్తారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ అగ్రనేతను నిలదీశారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు, భూకబ్జాలు, క్రోనీ క్యాపిటలిజం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ అగ్రనేత మౌనం వహించారని విమర్శించారు. అసెంబ్లీ ఎదుట మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడూ రాహుల్ కనీసం స్పందించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినప్పుడు రాజ్యాంగ ప్రక్రియను పట్టించుకోలేదని ఆరోపించారు.
కేబీఆర్ పార్కు అభివృద్ధి, చెట్ల తొలగింపు అంశాలపైనా స్పందించలేదని విమర్శించారు. పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్నప్పుడు, హైకోర్టు పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై వివాదం తలెత్తినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు, వేధింపులు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన సమయంలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల చర్యలు జరిగినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..