
కామారెడ్డి, 13 నవంబర్ (హి.స.)
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు గుర్తించి జరిమానాలు విధించారు. అంతేకాకుండా వాహనాలకు అక్కడికక్కడే నంబర్ ప్లేట్లు బిగించారు. పట్టుబడిన వాహనాలపై గతంలో నమోదైన పెండింగ్ చలాన్ల వివరాలను ఆన్లైన్లో పరిశీలించి, సంబంధిత వాహనదారులతో జరిమానాలను చెల్లింపజేశారు.
మరోసారి నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు సూచించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు