
షాద్నగర్, 13 నవంబర్ (హి.స.)
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19 నుండి పేద కుటుంబాలకు ధీమా కల్పించేందుకు రూ. 5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు.
సొంతిల్లు లేని వారందరూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫరూక్నగర్ లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పూర్తికి తాను ఎమ్మెల్యే అయిన వెంటనే రూ. 7 కోట్లు మంజూరు చేయించానని, మౌలిక వసతుల కల్పన పూర్తి చేసి త్వరలోనే అర్హులైన పేదలకు వాటిని అందజేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు.
పేదలు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని వివరించారు. పార్టీలకతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్లందరినీ కలుపుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..