
హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో దేశంలో అధికార మార్పిడి తప్పక జరుగుతుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
యువత తన శక్తిని ప్రదర్శించి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ రెండో ఎడిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైంది.
ఈ సమ్మేళనం ప్రారంభ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు..
యువత ఆకాంక్షలను పట్టించుకోకుండా వారిని దేశద్రోహులుగా, సంఘ విద్రోహులుగా ముద్ర వేస్తున్న బీజేపీ అగ్ర నాయకులకు త్వరలోనే తెలుస్తుందన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. అసలు స్వాతంత్ర్య పోరాటంలోనే పాల్గొనని బీజేపీ, దాని మాతృ సంస్థకు త్యాగాల గురించి ఏం తెలుస్తుందని, ఒక్క రోజు జైలుకు వెళ్లిన చరిత్ర అప్పటి జనసంఘ్ నేతలకు, ఆర్ఎస్ఎస్ పెద్దలకు కానీ లేదన్నారు. దేశం కోసం ఇందిరాజీ, రాజీవ్ జీ ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. నెహ్రూ, గాంధీల కుటుంబానికి ఈ దేశ అభ్యున్నతే తప్ప పదవుల అలంకారాలు అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధాని కావాలనుకుంటే నరేంద్ర మోడీ కంటే అత్యున్నత పీఠాన్ని అధిష్టించేవారని కానీ వారికి పదవీ కాంక్ష లేదన్నారు. సొంత కాళ్లపై నిలబడ్డ గిగ్ వర్కర్ల పట్ల బీజేపీ నేతలు చిన్నచూపు ప్రదర్శించడం వారి చీప్ మెంటాలిటీని బయటపెడుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రెండు రోజుల భారత్ సమ్మిట్‌కు ఆయనను దేశ ప్రతిపక్ష నేతగా ఆహ్వానిస్తున్నామని, ఆయన రాజ్యాంగ హోదాలో ఉన్నారని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన ప్రజాస్వామ్య విలువలను తిరిగి పునరుద్ధరించే నేతగా దేశమంతా రాహుల్ గాంధీ వైపు ఆశగా చూస్తోందని అన్నారు. భారత్ సమ్మిట్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆయనను మార్కెట్ చేయాలని చూస్తున్నామని బీజేపీ నేతలు విమర్శలు చేయడం వారి అక్కసు, కడుపు మంటను బయటపెడుతోందన్నారు. రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ప్రచారం కల్పించనవసరం లేదని, ఆయన ప్రపంచ స్థాయి నాయకుడన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..