
హైదరాబాద్ , 13 నవంబర్ (హి.స.)
ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 14వ తేదీని పని దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా తమ విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల అనంతరం వారి అంగీకారంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత అక్టోబర్ 19న ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే దసరా పండుగ సందర్భంగా ఇచ్చిన సెలవుకు బదులుగా ఈ నెల 14న ఉద్యోగులు విధులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు అందాయి.
ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 14న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఉద్యోగులంతా ఆరోజు కార్యాలయాలకు వచ్చి తమ రోజువారీ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. సెలవుల నిర్వహణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఈ నెల 14న ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్