
నిర్మల్, 13 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలోని ఏ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి అయినా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందని, దీన్ని నిరూపించడానికి తాను సిద్ధమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
పల్లెల్లో కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా సాయం చేయడం లేదని, కేంద్ర సాయంతోనే అన్నీ జరుగుతున్నాయని గుర్తించాలన్నారు. ఊటకో మాట మాటకు తూటా అన్న రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన సాగిందని, ఉద్యోగులు, యువజనులు, మహిళలు, విద్యార్థులను అడుగడుగునా మోసం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించడానికి తాను సిద్ధమని, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. స్థానికంగా ఎలాంటి బలం లేకుండా బీఆర్ఎస్ వారు పరిసర జిల్లాల నుంచి జనాన్ని తీసుకొచ్చి నిర్మల్లో రైతు గర్జన పేరిట సభ పెట్టుకోవడం హాస్యాస్పదంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై బీజేపీ ప్రజా ప్రతినిధులు, గ్రామీణ స్థాయిల్లో నిత్యం ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారని చెప్పారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిర్మల్లో నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనని, అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ లోనే మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించకుండా మొసలి కన్నీరు కారుస్తున్నాడని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్ అరాచకాలపై పోరాటం చేస్తోందని, వారి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని సైతం బయటకు తీస్తోందని అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడతానని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై బీజేపీ అన్ని విధాలా పోరాటాలు చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రోజువారీ పరిశీలన, విశ్లేషణతో ముందుకెళ్తోందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫ్రెండ్లీగా ఉంటూ బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేయడం, విమర్శలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం పోయిందన్న ఆందోళనలోనే ఉండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ అధికారం కోసం మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..