
అమరావతి , 13 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా శిక్షణా అకాడమీని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించారు. విశాఖపట్నంలో ఆర్పీఎస్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శశ్వత్ గోయెంకాతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ స్థాయి నుంచే యువతలోని క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి వృత్తిపరమైన శిక్షణ అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రం తరఫున ప్రత్యేక స్థానిక జట్టును ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే మంగళగిరిలో క్రీడా సదుపాయాల రూపకల్పన, అభివృద్ధికి సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్పీఎస్జీ గ్రూప్‌ను ఆహ్వానించారు. మరోవైపు సౌర విద్యుత్, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విజయవాడలో ఫస్ట్‌సోర్స్ ఐటీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు విశాఖపట్నం లేదా తిరుపతిలో కొత్త కార్యాలయాలు ప్రారంభించాలని సూచించారు.
ఇదే సమయంలో ఏపీలో రూ.3,286 కోట్లతో 349.8 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన కూడా ముందుకొచ్చింది. ప్రభుత్వం సూచించిన అవకాశాలను పరిశీలిస్తామని శశ్వత్ గోయెంకా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్