
ఏలూరు జిల్లా, 13 నవంబర్ (హి.స.)
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జీలుగుమిల్లి మండల పరిధిలోని బోతప్పగూడెం, అంకన్నగూడెం గ్రామాల మధ్య పెద్దపులి కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని రహదారిపై సంచరిస్తున్న పులి ఓ ఆవుపై దాడి చేసి చంపినట్లు సమాచారం. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అడవి ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో రైతులు, పశువుల కాపరులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. పశువులను పొలాలు, గ్రామ శివార్లలో వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పెద్దపులి సంచారంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. పులి కదలికలను గుర్తించి దాని జాడను తెలుసుకోవడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్