
అశ్వరావుపేట, 13 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పెద్దపులి ఈ ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా జిల్లెల్లగూడెంలో పులి దాడి చేయడంతో ఒక ఆవు చనిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంత రైతులు, పశువుల కాపరులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. పులి తిరుగుతున్న నేపథ్యంలో జిల్లెల్లగూడెంతో పాటు చెన్నైగూడెం, గోపన్నగూడెం, కన్నాయిగూడెం వంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.గ్రామస్థులు కూడా ఒంటరిగా పొలాల వైపు, అడవి వైపు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా పులి ఆనవాళ్లు కనిపించినా, దాని సంచారం కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పశువుల కాపరులు తమ ఆవులు, మేకలు, గొర్రెలను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లవద్దని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..