రాహుల్ గాంధీ ప్రచారానికే భారత్ సమ్మిట్.. బండి సంజయ్
తెలంగాణలో ప్రజలు తీవ్ర సమస్యలతో అల్లాడుతుంటే, ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి భారత్ సమ్మిట్ పేరిట అంతర్జాతీయ రాజకీయ చర్చలు జరపడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
బండి సంజయ్


హైదరాబాద్, 13 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ప్రజలు తీవ్ర సమస్యలతో అల్లాడుతుంటే, ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి భారత్ సమ్మిట్ పేరిట అంతర్జాతీయ రాజకీయ చర్చలు జరపడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సమ్మిట్ నిర్వహణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ఆయన పలు సూటి ప్రశ్నలు సంధించారు. గత సమ్మిట్లో 44 అంశాలతో చేసిన హైదరాబాద్ తీర్మానంలో ఎన్ని అమలయ్యాయి, దాని ద్వారా తెలంగాణకు ఎన్ని కొత్త పరిశ్రమలు, ఎన్ని కోట్ల పెట్టుబడులు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెబుతూ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆ సొమ్ము ఎవరికి చెల్లించారని, గత సమ్మిట్లో రూ.29.45 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.

తెలంగాణకు కావాల్సింది అంతర్జాతీయ సమావేశాల ప్రచారం కాదని, ఉద్యోగాలు, ఉపాధి, సాగునీరు, రైతులకు భరోసా అనే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం వల్ల తెలంగాణకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏలు, పీఆర్సీ, హెల్త్ కార్డులు లేక గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో రైతులు కరువుతో ఇబ్బంది పడుతున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజకీయ కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని, ఈ సమ్మిట్ నిర్వహణకు మొత్తం ఎంత ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత వెచ్చిస్తున్నారని నిలదీశారు. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికా, లేక రాహుల్ గాంధీ రాజకీయ ఆలోచనలకు అంతర్జాతీయ ప్రచారం కల్పించడానికా అని భారత్ సమ్మిట్ అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విదేశీ ప్రతినిధులతో చర్చించే అధికారం కాంగ్రెస్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి పేరుతో విదేశీ శక్తులతో కలిసి ఈ సదస్సు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. భారత్ సమ్మిట్లో పాల్గొంటున్న 70 దేశాల ప్రతినిధుల్లో మెజారిటీ వ్యక్తులు భారతదేశ విధానాలను వ్యతిరేకిస్తున్న వారేనని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేకుల కలయిక వేదికగా మారిందని విమర్శించారు. దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి విదేశీ శక్తులతో కలిసి చేస్తున్న కుట్ర ఇదని ఆయన విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande